Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మూవీ మొఘల్' రామానాయుడు ఇక లేరు

మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత రామానాయుడు (78) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. భారతీయ సినీ చరిత్రలో అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా పేరొందిన రామానాయుడు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. రామానాయుడుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా, పెద్ద కుమారుడు సురేష్ బాబు తండ్రి బాటలోనే నడుస్తూ సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు వెంకటేష్, తెలుగు నాట అగ్రహీరోగా కొనసాగుతున్నారు. కాగా, ఆయన మనవలు రాణా బహుభాషా నటుడిగా రాణిస్తుండగా, నాగ చైతన్య టాలీవుడ్ యువహీరోగా రాణిస్తున్నారు. రామానాయుడు 13 భాషల్లో సుమారు 150కి పైగా సినిమాలను నిర్మించారు. రామానాయుడు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించింది. ఇటుకల వ్యాపారం కోసం చెన్నై వెళ్లిన రామానాయుడు, కొంత కాలం స్థిరాస్తి వ్యాపారం చేశారు. అనంతరం మిత్రుల సలహామేరకు పెద్ద కుమారుడు సురేష్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి రాముడు-భీముడు, ప్రేమనగర్, సోగ్గాడు, శ్రీకృష్ణ తులాభారం, కలియుగపాండవులు, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం వంటి సినిమాలు నిర్మించారు. అనురాగం సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన రామానాయుడు, తరువాత పలు సినిమాల్లో నటుడిగా కనిపించారు. ప్రముఖ నిర్మాతగా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మవిభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, నేడు మృతి చెందారు.

More Telugu News