కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, శ్రీలంక... బంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళతామన్న మోదీ, మైత్రిపాల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, శ్రీలంక... బంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళతామన్న మోదీ, మైత్రిపాల

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళతామని శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో కలసి ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ ఆహ్వానం మేరకు సిరిసేన భారత పర్యటనకు విచ్చేశారు. ఆయనతో కలసి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోదీ విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు విషయాలపై చర్చించాయి, పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది, సివిల్ న్యూక్లియర్ డీల్. దీంతోపాటు, మత్స్యకారుల అరెస్ట్ విషయంపై కూడా ఓ అంగీకారానికి వచ్చారు. తరచుగా తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తుండటం... భారత కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలను లేవనెత్తుతోంది. మోదీ, సిరిసేనల భేటీతో ఈ సమస్యకు కూడా ఓ పరిష్కారం దొరికినట్టైంది. రెండు దేశాల మత్స్యకారుల విషయంలో ఇరు దేశాలు మానవత్వం ప్రదర్శించాలని సమావేశంలో నిర్ణయించినట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సంప్రదాయాలు, ఎనర్జీ సెక్టార్ లో సహకారం తదితర అంశాలపై వీరు చర్చించారు. నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణంలో శ్రీలంక పాలుపంచుకుంటుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఈ సహకారం రెండు దేశాల మధ్య 2000 ఏళ్లుగా ఉన్న బంధాన్ని గుర్తుచేస్తుందని అన్నారు. ప్రధాని మోదీ కూడా శ్రీలంకలో పర్యటిస్తే, తామెంతో సంతోషిస్తామని... ఆయన పర్యటన ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా సిరిసేన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News