దక్షిణాఫ్రికా బోణీ... జింబాబ్వేపై 62 పరుగుల తేడాతో విజయం
వరల్డ్ కప్ లో భాగంగా హామిల్టన్ లో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు మిల్లర్ (138 నాటౌట్), డుమినీ (115 నాటౌట్) అజేయ సెంచరీల సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఓ దశలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు మిల్లర్, డుమినీ జోడీ ధాటైన బ్యాటింగ్ తో పుంజుకుంది. ఈ జోడీని విడదీయడంలో జింబాబ్వే బౌలర్లు విఫలమయ్యారు.
అనంతరం, లక్ష్యఛేదనలో జింబాబ్వే 48.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో హామిల్టన్ మసకద్జా (80) టాప్ స్కోరర్. చిభాభా (64), టేలర్ (40) రాణించినా ఓటమి తప్పలేదు. సఫారీ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లు తీయగా, పేసర్లు ఫిలాండర్, మోర్కెల్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రధాన పేసర్ స్టెయిన్ కు ఓ వికెట్ దక్కింది.