30 శాతం పెరిగిన ఎస్బీఐ నికర లాభం... తగ్గిన మొండి బకాయిలు
దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. ఈ మూడు నెలల కాలంలో బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 30.2 శాతం పెరిగి రూ.2,910 కోట్లకు చేరింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో, నికర వడ్డీ మార్జిన్ 9.2 శాతం పెరిగి రూ.12,617 కోట్ల నుంచి రూ.13,777 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల మొత్తం తగ్గిందని, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి శాతం 5.73 నుంచి 4.90 శాతానికి తగ్గిందని బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు అందించిన రుణాల మొత్తం 7.28 శాతం పెరిగి రూ.12.32 లక్షల కోట్లకు, డిపాజిట్లు 11.8 శాతం పెరిగి రూ.15.10 లక్షల కోట్లకూ పెరిగాయని వివరించింది. కాగా, ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచగా, సంస్థ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 8 శాతానికి పైగా పెరిగి రూ.307 రూపాయల వద్ద కొనసాగింది.