వరల్డ్ కప్ హోరు షురూ... నేటి ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న పాప్ సింగర్లు
క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు నేడు మొదలవుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకలు నేడు ఆతిథ్య దేశాలు ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ లో హోరెత్తనున్నాయి. భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మెల్ బోర్న్ లోని మ్యూజిక్ బౌల్ (ఆస్ట్రేలియా), క్రైస్ట్ చర్చ్ లోని నార్త్ హ్యాగ్లీ పార్క్ (న్యూజిలాండ్)లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా పాప్ సింగర్లు జెస్సికా మౌబోయ్, టినా అరెనా, డార్లీ, బ్రాత్ వైట్ లు తమ పాటలతో పాటు డ్యాన్సులతోనూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. ఇక క్రైస్ట్ చర్చ్ వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్ పాప్ సింగర్లు సోలో 3 మియా, గిన్నీ బ్లాక్ మోర్, హెయిలీ వెస్ట్రినాలు సందడి చేయనున్నారు.