Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కండోమ్ ల కొరత... ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో హెచ్ఐవీ వ్యాప్తిపై భయాందోళనలు!

నిజమేనండోయ్, దేశంలోని ఆరు రాష్ట్రాల్లో కండోమ్ లకు తీవ్ర కొరత ఏర్పడిందట. హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే క్రమంలో జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ (నాకో) ఆయా రాష్ట్రాలకు కండోమ్ లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. 'నాకో' నుంచి అందుతున్న కండోమ్స్, ఎయిడ్స్ టెస్టింగ్ కిట్లు, రిట్రోవైరల్ డ్రగ్స్ ను స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సొసైటీ (శాక్స్)లు ఆయా స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్దేశిత గ్రూపులకు పంపిణీ చేస్తున్నాయి. తాజాగా తమకు కండోమ్ లతో పాటు, ఎయిడ్స్ కిట్లు సరిపడినన్ని అందడం లేదని ఆయా స్వచ్ఛంద సంస్థలు, శాక్స్ అధికారులకు మొరపెట్టుకుంటున్నాయట. ఈ తరహా విన్నపాలు వెల్లువెత్తుతున్న ఆరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందట. ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించే కండోమ్స్, ఎయిడ్స్ కిట్లు సరఫరా స్తంభించడంతో సదరు రాష్ట్రాల్లో ఎయిడ్స్ మహమ్మారి మరింత వేగంగా విస్తరించే ప్రమాదముందని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిమాండ్ కు సరిపడ కండోమ్ లను సరఫరా చేయడంలో హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్ విఫలమవుతుండటమే ఈ కొరతకు కారణమని తెలుస్తోంది. ఇతర కంపెనీల నుంచి కండోమ్ ల సేకరణకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు చేపడుతున్న ఎడతెగని చర్యలే కండోమ్ ల షార్టేజీకి మరో కారణమని నాకో అధికారులు చెబుతున్నారు. కండోమ్ ల కొరత నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతున్న ఆందోళనలతో నాకో అధికారులు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తాజాగా నేడు కూడా సదరు శాఖతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించనున్నట్లు నాకో చెబుతోంది.

More Telugu News