‘నారా’ వారి ఆదర్శం... మూడు గ్రామాలను దత్తత తీసుకున్న చంద్రబాబు కుటుంబం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘నారా’ వారి ఆదర్శం... మూడు గ్రామాలను దత్తత తీసుకున్న చంద్రబాబు కుటుంబం!

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంసద్ ఆవాస్ యోజన (మోడల్ విలేజ్) కింద ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. దత్తత తీసుకున్న ఆయా గ్రామాలను ఎంపీలు ఏడాదిలోగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సి ఉంది. మోడల్ విలేజ్ పథకం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబాన్ని కూడా ఆకర్షించినట్లుంది. అయితే చంద్రబాబు మినహా ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లో లేరు. అయితేనేం, మేం కూడా గ్రామాలను దత్తత తీసుకుంటామంటూ వారు ముందడుగేశారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెను ఆయన కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకోగా, చంద్రబాబు భార్య భువనేశ్వరి తన తల్లిగారి పుట్టిల్లు కొమురోలును దత్తత తీసుకున్నారు. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేశ్... తన తాత, దివంగత నేత ఎన్టీ రామారావు సొంతూరు నిమ్మకూరును దత్తత తీసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలంటే ప్రజా ప్రతినిధులే కావాల్సిన అవసరం లేదన్న రీతిలో వారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెకు వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News