ముషారఫ్ అరెస్టు.. రెండు రోజుల రిమాండ్ విధింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముషారఫ్ అరెస్టు.. రెండు రోజుల రిమాండ్ విధింపు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. కోర్టు ఆదేశాలకు భయపడి పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని ఫాంహౌస్ లో తలదాచుకున్న ముషారఫ్ ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ముషారఫ్ కు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముహమ్మద్ అబ్బాస్ షా రెండు రోజుల రిమాండ్ విధించారు. అంతేగాకుండా, రెండ్రోజుల్లో ముషారఫ్ ను తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఆయన్ను ఇస్లామాబాద్ కారాగారానికి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

2007లో 60 మంది న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించి.. నిర్భంధించిన కేసులో ముషారఫ్ ఇస్లామాబాద్ కోర్టుకు నిన్న హాజరయ్యారు. ఈ కేసులో తనకిచ్చిన బెయిల్ ను పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అంతేగాకుండా, తక్షణమే ముషారఫ్ ను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈలోపే ఈ మాజీ అధ్యక్షుడు కోర్టు నుంచి అదృశ్యమై ఫాంహౌస్ కు పరారయ్యారు.బెనజీర్ భుట్టో కాల్పుల కేసు సహా ఇంకా పలు కేసులను ముషారఫ్ ఎదుర్కొంటున్నారు.

వచ్చేనెల పాక్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లండన్, దుబాయ్ లో నాలుగున్నర సంవత్సరాల ప్రవాస జీవితం అనంతరం మార్చి 24న పాక్ కు తిరిగి వచ్చారు. ఈ మేరకు నాలుగు ప్రాంతాల నుంచి ఎన్నికల్లో పోటీకి ముషారఫ్ వేసిన నామినేషన్లలో మూడింటిని పాక్ ఈసీ తిరస్కరించింది. దాంతో ఆయన ఆశలు నీరుగారాయి.

More Telugu News