రావణుడు, మండోదరి యూపీ దళితులట!
రావణుడు లంకాధీశుడని, అతని భార్య పేరు మండోదరి అని అందరికీ తెలిసిందే. వీరి జాతి, జన్మస్థలం గురించి ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లేవు. అయితే, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రావణుడు, మండోదరి దళితులని, వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారని అంటున్నారు. బెనారస్ హిందూ యూనివర్శిటీలో నిర్వహించిన 'ఐ అండ్ మై ఇండియా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రావణుడు ఘజియాబాద్ సమీపంలోని బస్రఖ్ ప్రాంతంలో జన్మించాడని, మండోదరి మీరట్ ప్రాంతానికి చెందినదని వివరించారు. శివుడి ఆశీస్సులతో రావణుడు లంకను చేజిక్కించుకున్నాడని స్వామి తెలిపారు.
ఈ వివరాలను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయాలని అన్నారు. దేశీయ, విలువ ఆధారిత విద్యా వ్యవస్థ ఉన్నతికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. ఇక, భారత్ లో జన్మించిన వారందరూ హిందువులేనని, వారి డీఎన్ఏ పరీక్షిస్తే ఆ విషయం స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయం దేశంలోని ముస్లింలకు కూడా తెలుసని అన్నారు.