పయ్యావుల, గాలి, సోమిరెడ్డిలకు ఎమ్మెల్సీ పదవులు?
పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... టీడీపీలో కీలక నేతలైన వీరు, మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఉండేవారు. అయితే, అనూహ్యంగా ఓటమిపాలైన వీరు ముగ్గురికీ ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడంతో... ఎమ్మెల్సీ పదవులు చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. విపక్షాలను ఎదుర్కోవడంలో సిద్ధహస్తులైన వీరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా టీడీపీ అధిష్ఠానం సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ తరపున ఎమ్మెల్సీ రేసులో మరికొంత మంది కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఫరూఖ్, కడప జిల్లాకు చెందిన పుత్తా నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డిలతో పాటు టీడీ జనార్ధన్, వీవీవీ చౌదరి, జయరామిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. మరోవైపు, పార్టీ కార్యాలయంలో ఉండే ఎం.ఏ.షరీఫ్ కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.