వివాహ వేడుకకు నేవీ హెలికాఫ్టర్ లో జైట్లీ కుటుంబం...ప్రధానికి గోవా న్యాయవాది ఫిర్యాదు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్థిక పద్దుల రూపకల్పనలో ఆరితేరిన ఆయన, తన కుటుంబ సభ్యులు చేసిన నిర్వాకం వల్ల వివాదాల సుడిలో చిక్కుకున్నారు. గోవాలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన భార్య, కూతురు నిబంధనలకు విరుద్ధంగా భారత నావికాదళ హెలికాఫ్టర్ ను వినియోగించారు.
వివరాల్లోకెళితే...ఈ నెల 23న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఇండిగో విమానంలో గోవా చేరుకున్న జైట్లీ భార్య సంగీత, కూతురు సోనాలీలు అక్కడి నుంచి వివాహ వేడుక జరుగుతున్న కానాకోనా రిసార్ట్ కు వెళ్లేందుకు నేవీ హెలికాఫ్టర్ వినియోగించారు. దీనిపై గోవాకు చెందిన న్యాయవాది ఐరిస్ రోడ్రిగ్జ్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. అరుణ్ జైట్లీ కుటుంబం అధికార దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఆయన మోదీని కోరారు. సుపరిపాలన అంటూ మెరుగైన పాలనకు తెరతీసిన మోదీ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సిందేనని రోడ్రిగ్జ్ కోరుతున్నారు. మరి ఈ విషయంపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.