అసోం బోడోల దాడిలో 49కి పెరిగిన మృతులు...నేడు ఘటనా స్థలానికి రాజ్ నాథ్
అసోంలో బోడో తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. రాష్ట్రంలోని కోక్రాఝర్, సోనిట్ పూర్ లలో విరుచుకుపడిన బోడోలు ఏకే-47 తుపాకులతో జరిపిన ఈ దాడిలో తొలుత 37 మంది మరణించారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన మరో పది మంది క్షతగాత్రులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మృత్యువాతపడ్డారు.
బోడోల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. బోడోల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు అసోంలో పర్యటించనున్నారు. దాడి జరిగిన ప్రదేశాలను సందర్శించనున్న రాజ్ నాథ్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపే యత్నం చేయనున్నారు.