బ్యాంకు దోపిడీ విఫలం... క్షమాపణ పత్రం రాసిన దొంగ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాంకు దోపిడీ విఫలం... క్షమాపణ పత్రం రాసిన దొంగ

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ దొంగ రాసిన క్షమాపణ పత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం రాత్రి సదరు దొంగ కెనరా బ్యాంకు దోపిడీకి యత్నించి విఫలమయ్యాడు. నగదు, ఆభరణాలన్నీ స్ట్రాంగ్ రూంలో ఉండడంతో అతడు ఉత్త చేతులతో వెనుదిరగక తప్పలేదు. లాక్ తొలగించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన అతగాడికి స్ట్రాంగ్ రూంను బద్దలు కొట్టడం శక్తికి మించిన పనైంది. దీంతో చేసేదేమీలేక, బ్యాంకులోనే ఓ చైర్లో కూర్చుని లెటర్ హెడ్ పై తన గోడు వెళ్లబోసుకున్నాడు. క్షమించాలని కోరుతూ, తానెందుకు దొంగతానానికి వచ్చాడో వివరించాడు. "మీ కుర్చీలో కూర్చుని మీకే రాస్తున్నాను. నాకు పిల్లలున్నారు. ధరలు పెరిగిపోయాయి. నా ప్రైవేటు ఉద్యోగం కూడా ఊడింది" అని హిందీలో రాశాడు. సోమవారం ఉదయం సిబ్బంది వచ్చి చూసేసరికి బ్యాంకు తలుపులకు ఉన్న తాళాలు తెరుచుకుని ఉన్నాయి. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. జాగిలాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం వెతుకుతుండగా లేఖ కంటబడింది. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు ధీమాగా చెప్పారు.

More Telugu News