టీఆర్ఎస్ తీరు ఇలా ఉంది... అడిగితే సస్పెండ్ చేస్తారా?: ఎర్రబెల్లి
తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఆందోళన చేపట్టిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టి నిర్వహించిన సమగ్ర సర్వేలో ఎంపీ కవిత రెండుచోట్ల ఎలా నమోదు చేయించుకున్నారన్న విషయమై శాసనసభలో ప్రశ్నిస్తే, 'నా కూతురు గురించి మాట్లాడుతారా?' అంటూ 10 మందిని సస్పెండ్ చేశారని అన్నారు.
తమ సీఎం కుమార్తె గురించి ప్రశ్నిస్తారా? అంటూ టీఆర్ఎస్ నేతలు రెండు రోజులు సభ జరుగకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా? ఆమె తప్పు చేస్తే ప్రశ్నించడం తప్పా? అని ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తామని భయపడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం తమను వారం రోజులపాటు సస్పెండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన చేస్తామని ఆయన తెలిపారు.