మోదీ... సంగీత ప్రియుడే!
ప్రధాని నరేంద్ర మోదీ నానాటికీ సంగీత ప్రియుడిగా మారుతున్నారు. భారత్ లో ఉండగా అంతగా సంగీతంపై దృష్టి సారించని మోదీ, విదేశీ పర్యటనల సందర్భంగా మాత్రం ఆసక్తి కనబరుస్తున్నారు. మొన్నటి జపాన్ పర్యటనలో డ్రమ్ములను మోత మోగించిన ప్రధాని, తాజాగా మయన్మార్ పర్యటనలో అక్కడ ‘పట్టాలా’గా పిలిచే జైలోఫోన్ పై ఆసక్తి కనబరిచారు.
మయన్మార్ లో పర్యటిస్తున్న మోదీ, బుధవారం మయన్మార్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గియెన్ హీతో భేటీ కోసం అక్కడికి వెళ్లిన ఆయన, హోటళ్లో ఓ చోట కొద్ది నిమిషాల సేపు మైమరచి నిలిచిపోయారు. ఎందుకంటే, అక్కడ ఓ యువకుడు పట్టాలాపై హృద్యమైన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఆ యువకుడు పట్టాలాను వినియోగిస్తున్న తీరును పరిశీలిస్తూనే, దాని నుంచి వెలువడుతున్న మంద్రమైన సంగీతాన్ని అలా ఆస్వాదించేశారు. అయితే జపాన్ లో లాగా దానిపై తన ప్రతాపాన్ని చూపేందుకు మాత్రం ఆయన సాహసించలేదు.