క్రికెట్ కన్నా సాకర్ అంటేనే ఇష్టమంటున్న జార్ఖండ్ డైనమైట్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకున్న సాకర్ అభిమానం అందరికీ తెలిసిందే. అందుకే, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ చాంపియన్ షిప్ లో చెన్నయిన్ ఎఫ్ సీ ఫ్రాంచైజీ భాగస్వామ్యం కూడా తీసుకున్నాడు. మంగళవారం రాత్రి ధోనీ జట్టుతో ముంబయి సిటీ ఎఫ్ సీ జట్టు తలపడింది. చెన్నైలో ఈ మ్యాచ్ జరిగింది. తన జట్టు మ్యాచ్ కు హాజరైన ధోనీ, మ్యాచ్ బ్రేక్ సమయంలో సరదాగా గోల్ కీపింగ్ చేసి ప్రేక్షకులను అలరించాడు. చెన్నయిన్ ఎఫ్ సీ మరో సహ యజమాని, బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కూడా మైదానంలోకి దిగి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, ఫుట్ బాలే తన ఫస్ట్ లవ్ అని పేర్కొన్నాడు. పదిహేనేళ్ళ క్రితం తాను సాకర్ ఆడానని, మళ్ళీ ఫుట్ బాల్ మైదానంలో అడుగుపెట్టడం సంతోషం కలిగిస్తోందని అన్నాడు.