సినిమా చూసేందుకు భర్త ఒప్పుకోలేదని యాసిడ్ తాగిన భార్య
సినిమా చూసేందుకు భర్త ఒప్పుకోలేదన్న కారణంతో ఓ భార్య యాసిడ్ తాగిన ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట (ఆదివారం) భర్త విశాల్ ఆ సినిమా చూసేందుకు వెళుతున్నాడు. తనను కూడా తీసుకెళ్లాలని భర్తను భార్య నేహ సేన్ అడిగింది.
ఆ రోజు బాగా రద్దీగా ఉంటుందని, భార్యను తీసుకువెళ్లకుండా విశాల్ ఒక్కడే సినిమాకు వెళ్లిపోయాడు. దాంతో, తీవ్ర నిరాశ చెందిన నేహ యాసిడ్ తాగేసింది. ప్రస్తుతం ఆమె గ్వాలియర్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని స్ధానిక పోలీసులు వెల్లడించారు. యాసిడ్ తాగడంవల్ల ఆమె అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయని పోలీసులు వివరించారు. ఈ విషయంపై ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశామని చెప్పారు. అటు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.