వరద బాధితులకు 'కాశ్మీరీ పండిట్ మహిళ' సాయం
సెప్టెంబర్ లో వచ్చిన భారీ వరదలు జమ్మూకాశ్మీర్ ను ఇప్పట్లో కోలుకోలేనంతగా నష్టపరచాయి. నిలువనీడలేక అనేకమంది రోడ్డున పడ్డారు. ఎవరైనా వచ్చి సాయం చేస్తారని చూస్తున్న వారికి కాశ్మీరీ పండిట్ లే సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా సుమన్ రైనా అనే కాశ్మీరీ పండిట్ మహిళ అక్కడి వారిని ఆదుకుంటోంది. వరద బాధితుల ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టి వంటింటికి అవసరమైన సామాన్లను బహుమతులుగా ఇస్తోంది.
"వరద నాశనం చూసి నేను చాలా బాధకు లోనయ్యాను. అందుకే ఏదో ఒక సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను" అని ప్రస్తుతం జైపూర్ లో ఈవెంట్ మేనేజర్ గా చేస్తున్న రైనా చెబుతోంది. అంతేకాదు మరింత మందిని ఆదుకునేందుకు బాలీవుడ్ గాయకుడు కృష్ణ కుమార్ కున్నత్ తో ఓ కన్సర్ట్ నిర్వహించబోతోంది. అలా వచ్చిన డబ్బును కాశ్మీర్ బాధితులకు ఇవ్వనుంది.
మరోవైపు ఢిల్లీకి చెందిన సోషియో-రిలీజియస్ సంస్థతో సంబంధాలున్న రైనా, వారి సాయంతో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి కుటుంబం ఉండేందుకు తాత్కాలికంగా ఓ ఇంటిని రూపొందించి నీడ కల్పించారు. అలా దాదాపు 67 కుటుంబాలు తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వమే కాక పలు స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులకు సాయం అందిస్తూ ఆదుకుంటున్నాయి.