Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పోలీసు' తమ్ముడి మాట మన్నించిన 'మావోయిస్టు' అక్క!

ఛత్తీస్ గఢ్ లోని కొడోలి గ్రామానికి చెందిన శాంతి కుంజం అనే యువతి 2005లో నక్సల్ ఉద్యమంలో అడుగుపెట్టింది. సాధారణ సభ్యురాలి స్థాయి నుంచి దళ నాయకురాలిగా ఎదిగింది. పలు ఘటనలతో సంబంధం ఉందన్న కారణంతో ఆమె తలపై ఛత్తీస్ గఢ్ సర్కారు రూ.5 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా, శాంతి తమ్ముడు అనిల్ కుమార్ కు పోలీసు ఉద్యోగం వచ్చింది. దీంతో, వీరిమధ్య సహజ వైరం ఏర్పడినట్టయింది. దీపావళి సందర్భంగా శాంతి స్వగ్రామం రాగా, తమ్ముడు అనిల్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఉద్యమాన్ని వదిలి రావాల్సిందిగా అక్కను కోరాడు. తమ్ముడి మాటకు విలువిచ్చిన ఆమె పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయింది. శాంతికి రివార్డు మొత్తాన్ని అందిస్తామని, కొంత వ్యవసాయ భూమిని కేటాయించేలా జిల్లా కలెక్టర్ తో మాట్లాడతామని అధికారులు తెలిపారు. ఇక, శాంతి లొంగుబాటుకు కారణమైన అనిల్ ను వారు అభినందించారు.

More Telugu News