తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
తూర్పుగోదావరి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. జిల్లాలోని కొత్తపేట మండలం గంటిపల్లిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం మెడలో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు దిగారు.
రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యవహరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా గ్రామస్థులు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.