ఏపీలో భూ వినియోగ మార్పిడి ఫీజు రెట్టింపు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నిర్మాణానికి తెరలేచింది. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబు సర్కారు కూడా రంగంలోకి దిగింది. భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై భూమి విలువలో పది శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదివరకు ఈ ఫీజు 5 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం సచివాలయంలో ఆదాయ వనరుల సేకరణపై ఉన్నతాధికారులతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా భూ వినియోగ మార్పిడి ఫీజులు రెట్టింపు చేయాలని మంత్రి తీర్మానించినట్లు సమాచారం. సేల్ డీడ్లు, భూదానాలపై వసూలు చేస్తున్న 1 శాతం ఫీజును కూడా రెట్టింపు చేస్తూ 2 శాతాన్ని వసూలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గనుల లీజులను కూడా పెంచాలని మంత్రి నిర్ణయించినట్లు సమాచారం.