ప్రతిపక్షాలను నిర్మూలించడమే కేసీఆర్ ఎజెండా!: డీఎస్
మన రాష్ట్రం-మన పాలన అని తెలంగాణను తెచ్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు తలకొట్టుకునేలా ఉందని టీకాంగ్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఎజెండాతో కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరితేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తామని బెదిరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురుశిష్యులైన చంద్రబాబు, కేసీఆర్ కొట్లాడుకోవడం మాని, పరస్పరం సహకరించుకోవడం ద్వారా తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలని ఆయన సూచించారు.
కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎజెండా లేదని, ఇప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన చేయలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు, రైతులకు సమర్ధవంతమైన పాలన అందవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.