అవును, నేను స్త్రీలోలుడినే: షేన్ వార్న్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రేమాయణాల గురించి ఎన్ని వార్తలో! భార్యతో విడివడినప్పటి నుంచి ఎందరితోనో ఎఫైర్లు సాగించిన వార్న్ తాజాగా, తాను స్త్రీలోలుడినేనని అంగీకరించాడు. తనని తాను 'సూట్స్' అనే టీవీ షోలోని క్యారెక్టర్ 'హార్వే స్పెక్టర్' లాంటి వాడినని అభివర్ణించుకున్నాడు. ఈ మేరకు వార్న్ ట్వీట్ చేశాడు. 'సూట్స్' టీవీ షోలోని కొన్ని పాత్రలను ఆస్ట్రేలియా క్రికెటర్లకు అన్వయించాడు. తాను హార్వే స్పెక్టర్ నని, లూయిస్ లిట్ పాత్రతో పేస్ బౌలింగ్ దిగ్గజం మెర్వ్ హ్యూస్ ను పోల్చవచ్చని, మైక్ రాస్ పాత్రతో కెప్టెన్ మైకేల్ క్లార్క్, రిటైర్డ్ ఆఫ్ స్పిన్నర్ టిమ్ మేను పోల్చవచ్చని సెలవిచ్చాడు. కాగా, సూట్స్ టీవీ షోలో హార్వే స్పెక్టర్ ఓ న్యూయార్క్ లాయర్. మోసకారితనం ఎక్కువే అయినా, ఆధునిక భావాలున్నవాడు. అమ్మాయిలంటే పడిచస్తాడు!
కాగా, ఆస్ట్రేలియాకు సుదీర్ఘకాలం సేవలందించిన వార్న్ కెరీర్ మొత్తమ్మీద 708 టెస్టు వికెట్లు, 293 వన్డే వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2006లో ఆటకు రిటైర్మెంటు ప్రకటించిన తర్వాత, వ్యాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇక, వైవాహిక జీవితం విషయానికొస్తే, సిమోన్ కల్లహాన్ ను పెళ్ళాడి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు. 2005లోనే వీరు విడిపోయారు. ప్రముఖ మోడల్, బ్రిటీష్ నటి ఎలిజబెత్ హర్లీనే వార్న్ కాపురంలో చిచ్చుకు కారణమని బ్రిటన్ టాబ్లాయిడ్లు కోడై కూశాయి. హర్లీనే కాకుండా, మరికొందరితోనూ వార్న్ ప్రేమాయణాలు సాగించినట్టు ఎన్నో వార్తలొచ్చాయి. తాజాగా, ఈ మాజీ క్రికెటర్ మళ్ళీ సిమోన్ కల్లహాన్ తో జీవించాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నా, వార్న్ వాటిని కొట్టిపారేశాడు.