మీ పిల్లలు ఏం చూస్తున్నారో గమనించండి!
ఈ కాలంలో పిల్లల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు కనిపిస్తున్నాయి. టీనేజర్లయితే అవి లేకుండా ఉండలేని పరిస్థితి! ఇలాంటి ధోరణి ప్రబలితే ప్రమాదమంటున్నారు సైకాలజిస్టులు. అందుకే, తమ పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని వారు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో పిల్లలు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్న ఘటనలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో తెలియక తల్లిదండ్రులు, టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. అయితే, అందుకు చేయాల్సిందల్లా తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ మాట్లాడుతూ, వారితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చన్నది నిపుణుల అభిప్రాయం.
అశ్లీలం, హింసతో కూడుకున్న చిత్రాలకు బానిసలైతే ఎదురయ్యే దుష్పరిణామాలను పిల్లలకు ఓపికతో వివరించాలని సీనియర్ సైకియాట్రిస్ట్ సీజే జాన్ సూచించారు. ఎదిగే పిల్లల్లో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలన్న కోరిక సహజమని, అదో నేరమనో, ఘోరమనో భావించరాదని ఆయన పేర్కొన్నారు. వారితో ఉల్లాసంగా గడిపేందుకు కొంత సమయం కేటాయించడం ద్వారా ఇలాంటి వాటి నుంచి వారిని దూరం చేయవచ్చని సలహా ఇచ్చారు.