శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయొద్దనే హక్కు ఏపీకి లేదు: నోముల
విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కేటాయింపులు జరగలేదని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య మండిపడ్డారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయం విద్యుత్ పైనే ఆధారపడి ఉందని అన్నారు. రైతుల పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న 700 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆపితే... 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం అంటోందని... ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాకు రావాల్సిన వాటాను తొక్కి పెట్టి ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయవద్దనే హక్కు ఏపీకి లేదని అన్నారు. నల్గొండలో నిన్న జరిగిన ఘటనను భూతద్దంలో పెద్దదిగా చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాల నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.