జయ బెయిల్ కు వెంకయ్యనాయుడు సమర్థన
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమర్ధించారు. అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న జయలలితకు బెయిల్ ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు సరైన నిర్ణయమే తీసుకుందని ఆయన శుక్రవారం చెన్నైలో వ్యాఖ్యానించారు.
కోర్టు ఆదేశాలను జయలలిత అతిక్రమించబోరని కూడా ఆయన అన్నారు. బెయిల్ తీసుకున్న జయలలిత దేశం వదిలి పారిపోరని, బెయిల్ ను దుర్వినియోగం చేయరన్నారు. 18 ఏళ్ల పాటు సాగిన విచారణలో కిందికోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు కూడా నిర్ణీత వ్యవధిని విధించడం మంచిదేనని, అయితే కోర్టు తుది నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.