Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లలతో వ్యభిచారం... 343 బిలియన్ డాలర్ల వ్యాపారం: కైలాశ్ సత్యార్థి

బాలికలతో భారత్ లో బలవంతంగా జరుగుతున్న వ్యభిచారం... 343 బిలియన్ డాలర్ల వ్యాపారంగా విలసిల్లుతోందని నోబెల్ శాంతి బహుమతి విజేత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాశ్ సత్యార్థి చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్ ల నుంచి అపహరించిన అమ్మాయిలతో ఈ తరహా వ్యభిచారం నిరాఘాటంగా సాగుతోందని సత్యార్థి నేతృత్వంలోని ‘గ్లోబల్ మార్చ్ అగెయినెస్ట్ చైల్డ్ లేబర్’ జరిపిన అధ్యయనం తేల్చిచెబుతోంది. భారత్ లో పసిపిల్లలతో చేయిస్తున్న ఈ తరహా వ్యభిచారం తరాలుగా కొనసాగుతోందని కూడా ‘ఎకానమిక్స్ బిహైండ్ ఫోర్స్ డ్ లేబర్ ట్రాఫికింగ్’ పేరిట విడుదలైన ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్ లో 32 లక్షల మంది చిన్నారులు బలవంతంగా వ్యభిచార కూపంలో కొనసాగుతున్నారు. వీరిలో 60 శాతం మంది బీహార్, అసోంలకు చెందిన వారే. 14 నుంచి 16 ఏళ్ల వయసు మధ్యనున్న బాలికలను ట్రాఫికర్లు వ్యభిచారంలోకి నెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,100 రెడ్ లైట్ ఏరియాలుండగా, ఒక్కో రెడ్ లైట్ ఏరియాలో 140 దాకా బ్రోతల్ హౌస్ లున్నాయి. ఒక్కో బ్రోతల్ హౌస్ పిల్లలను తార్చడం ద్వారా ఏటా 24 లక్షల డాలర్లను ఆర్జిస్తోంది. ఈ లెక్కన దేశంలో బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టడం ద్వారా ఏటా 343 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం సాగుతోందని ఆ అధ్యయనం లెక్కలేసింది.

More Telugu News