కార్పొరేట్ దిగ్గజాలతో నేడు మోడీ భేటీ!
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆ దేశ కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఉదయం అల్పాహార విందు సందర్భంగా జరిగే ఈ భేటీలో గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ తో పాటు బోయింగ్ చైర్మన్ జేమ్స్ మెక్ నార్నీ, అమెరికన్ పెట్టుబడి దిగ్గజం బ్లాక్ రాక్ సీఈఓ లారెన్స్ డీ ఫింక్, ఐబీఎం సీఈఓ జిన్నీ రొమెట్టి, జనరల్ ఎలక్ట్రికల్ సీఈఓ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్, గోల్డ్ మన్ శాచ్స్ సీఈఓ లాయిడ్ బ్లాంక్ ఫీన్, అమెరికన్ ఈక్విటీ దిగ్గజం కొహెల్ బర్గ్ క్రేవిస్ రాబర్ట్స్ అండ్ కంపెనీ సీఈఓ హెన్రీ క్రేవిస్ లతో విడివిడిగా భేటీ కానున్నారు.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత ఉత్పత్తి రంగంలో ఏటా 10 శాతం వృద్ధిని నమోదు చేయాలని భావిస్తున్న మోడీ, భారత్ లోని అపార అవకాశాలను ఈ సందర్భంగా దిగ్గజ కంపెనీల బాసుల ముందు పెట్టనున్నారు. అంతేకాక పెట్టుబడులతో తమ దేశంలో అడుగుపెడితే ఈ తరహా ప్రయోజనాలు లభిస్తాయన్న విషయాన్ని కూడా మోడీ వారికి వివరించనున్నారు. దీంతో భారత్ కు భారీ పెట్టుబడులను సాధించే క్రమంలోనే మోడీ, ఈ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.