నిబంధన సడలించలేదని తప్పుకున్న ఖతార్ మహిళా జట్టు
నిబంధన సడలించలేదనే కారణంతో ఆసియా క్రీడలనుంచి ఖతార్ మహిళా బాస్కెట్ బాల్ జట్టు వైదొలగింది. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు. తల చూట్టూ ఉండే ‘హిజాబ్’ (వెయిల్, కొంగు) ను అనుమతించని కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఖతార్ జట్టు షెడ్యూల్ ప్రకారం నేడు తమ చివరి మ్యాచ్ కజకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. హిజాబ్ ను అనుమతిస్తూ నిబంధనలు మారిస్తేనే ఆడతామన్న ఆ జట్టు, అనుమతి లభించకపోవడంతో స్వదేశానికి పయనమైంది.
ఏషియాడ్ నిర్వాహకులు తమ మతాన్ని గౌరవించలేదంటూ ఆ జట్టు మేనేజర్ వ్యాఖ్యానించారు. అతని వ్యాఖ్యలు సరికాదన్న అంతర్జాతీయ బాస్కెట్ బాల్ సంఘం (ఫిబా), నిబంధనకు, మతానికి ముడి పెట్టడం సరి కాదని పేర్కొంది. ఖతార్ దేశవాళీ పోటీల్లో ఇప్పటికే ‘హిజాబ్’ అనుమతిస్తున్నామని, భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అమలు చేసే విషయం పరిశీలనలో ఉందని వారు తెలిపారు.