దమ్మిడీ చెల్లించకుండా విమానంలో రిజర్వేషన్
విమానయాన రంగంలో పోటీ అనేది వినియోగదారుల పాలిట వరంగా మారుతోంది. విభిన్న ఆఫర్లతో విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు టికెట్ల రేట్ల విషయంలో పలు ఆఫర్లు ఇచ్చిన సంస్థలు ఇప్పుడు ముందస్తు బుకింగులపై ఆఫర్లకు సిద్ధమవుతున్నాయి. మామూలుగా బస్సుకైనా, ట్రైన్ కైనా, విమానానికి అయినా రిజర్వేషన్ సౌకర్యం కావాలంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిందే!
అయితే, పైసా కూడా చెల్లించకుండా రిజర్వేషన్ చేసుకుని, అవసరమనుకుంటే టికెట్ ఖరారు చేసుకునే వెసులుబాటును ఇండిగో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఆఫర్ ప్రకారం ఇండిగో సంస్థకు చెందిన ఏ విమానంలోనైనా సీట్లను బుక్ చేసుకోవచ్చు. ఆరుగంటల పాటు ఆ సీట్లను వారి అధీనంలో ఉంచుకోవచ్చు. ఆ సీట్లు కావాలనుకుంటే ఆ ఆరుగంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆరుగంటల్లోపు డబ్బు చెల్లించకపోతే సీట్ల బుకింగ్ రద్దవుతుంది. 72 గంటల తర్వాత చేసే ప్రయాణాలకే ఈ విధానం వర్తిస్తుంది. అంటే, టికెట్ బుక్ చేసుకున్న మూడు రోజుల తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట.
అయితే, ఇలా రిజర్వు చేసుకోవాలంటే ముందుగా ఇండిగో వెబ్ సైట్ లో మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత మీకు కావాల్సిన విమానం ఎంచుకుని 'పే లేటర్' అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వినియోగదారులకు పీఎన్ఆర్ నెంబర్ వస్తుంది. బుక్ చేసుకున్న సీట్లకు ఆరు గంటల్లోపు డబ్బు జమ చేస్తే రిజర్వేషన్ ఖరారైనట్టే. ఈ విషయాన్ని ఇండిగో తన ట్విట్టర్, ఫేస్ బుక్ లో తెలిపింది. దమ్మిడీ ఖర్చు చేయకుండా రిజర్వేషన్ ఆఫర్ బాగుందని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.