నేడు మోడీ ‘‘మేక్ ఇన్ ఇండియా’’కు శ్రీకారం!
ప్రధాని నరేంద్ర మోడీ మరో కలల ప్రాజెక్టు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. భారత్ ను ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా మలిచే బృహత్తర లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు వెళ్లే ముందుగా మోడీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రం మంత్రివర్గ సహచరులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు కూడా హాజరుకానున్నారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి దేశంలోనే కాక పలు దేశాల రాజధానులు, ముఖ్య నగరాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. తద్వారా విదేశీ బడా పారిశ్రామిక వేత్తలను కూడా భారత్ లో తమ కార్యకలాపాలు సాగించేలా ప్రోత్సహించనున్నారు. పెట్టుబడులతో వచ్చే దేశీ, విదేశీ పారిశ్రామిక వేత్తలకు ‘ఇన్వెస్ట్ ఇండియా’ పేరిట కేంద్ర వాణజ్య మంత్రిత్వ శాఖ రెడ్ కార్పెట్ పరచడంతో పాటు అన్ని రకాల అనుమతులను క్షణాల్లో ఇప్పించే బాధ్యతను స్వీకరించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సందేహాలు తీర్చడంతో పాటు సలహాలు ఇచ్చేందుకు ‘మేక్ ఇన్ ఇండియా.కామ్’ పేరిట ప్రత్యేక వెబ్ సైట్ కూడా ఏర్పాటైంది.