'అలీబాబా' జాక్ మా... ఆసియా సెకండ్ రిచెస్ట్ మ్యాన్!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం 'అలీబాబా' వ్యవస్థాపకుడు జాక్ మా ఆసియాలోని అత్యంత ధనవంతుల్లో రెండో వ్యక్తిగా నిలిచారు. గతవారం ఐపీఓలో 25 బిలియన్ డాలర్లను కొల్లగొట్టి రికార్డు సృష్టించిన అలీబాబా.కామ్, తన వ్యవస్థాపకుడి నెట్ వర్త్ నూ అమాంతం పెంచేసింది. బ్లూంబర్గ్ ఆసియా బిలియనీర్ల జాబితాలో జాక్ మా... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, హాంకాంగ్ బిలియనీర్ లీ షావూ కీ లను వెనక్కి నెట్టేసి, రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో హెచ్ కే అధినేత లి కా-షింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఇంగ్లిష్ టీచర్ గా వృత్తి జీవితాన్ని ప్రారరంభించిన జాక్ మా, తన అలీబాబాను వాల్ మార్ట్ కంటే పెద్దదిగా నిర్మించేందుకు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం 231 బిలియన్ డాలర్ల విలువ ఉన్న అలీబాబా, తన బాసు ఆస్తులను 26.5 బిలియన్ డాలర్లకు పెంచేసింది. ఇక భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ 23.2 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.