ఫాస్ట్ పై నేను ముందు నుంచి చెబుతున్నదే నిన్న హైకోర్టు చెప్పింది!: చంద్రబాబు
ఫాస్ట్ స్కీమ్ పై తాను అనుకున్నట్టే జరిగిందని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తాను ముందు నుంచి ఫాస్ట్ పథకం కరెక్టు కాదని, తెలుగువారినందరినీ సమానంగా చూడాలని అంటున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. సాధారణంగా అయితే, ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఫీజులు 50:50 పంచుకోవాల్సి వస్తుందని... కానీ, గొడవలు మంచిది కాదన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58శాతం భరించడానికి ముందుకు వచ్చిందన్నారు.
తాను గతంలో చెప్పిందే, ప్రస్తుతం హైకోర్టు కూడా చెప్పిందన్నారు. తెలుగుదేశం హయాంలోనే తెలంగాణ అభివృద్ది జరిగిందని, హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ను తానే క్రియేట్ చేశానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే... తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టమని తాను మొదటి నుంచి చెబుతూ వస్తున్నానని, అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తోందన్నారు.