సైనాపై గుత్తా జ్వాల వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైనాపై గుత్తా జ్వాల వ్యాఖ్యలు

తాజాగా జరిగిన కామన్ వెల్త్ (సీడబ్ల్యూజీ) క్రీడల్లో మహిళల డబుల్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి తనకు (సైనాకు) రావాల్సిన నగదు రివార్డు గురించి బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఆంగ్ల చానల్ జీ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్వాల, అసలు దీనిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కావడంలేదంది. సైనాకు మంచి పేరుందని, తనకు ఇవ్వాల్సిన నగదుపై వ్యక్తిగతంగా సదరు మంత్రులను కలసి మాట్లాడాల్సిందని సూచించింది. అంతేగానీ, ఇలా పబ్లిక్ గా చెప్పడం ఓ స్పోర్ట్స్ పర్సన్ అయిన తన స్థాయికి సరిపడలేదని అసహనం వ్యక్తం చేసింది. డబ్బుకు సంబందించిన విషయాల్లో తన తీరు భిన్నంగా ఉంటుందని, ఇలా పబ్లిక్ గా మాట్లాడనని జ్వాల చెప్పింది. నేరుగా మంత్రులను కలసి సమస్యను పరిష్కరించుకుంటానని అదే సరైందని స్పష్టం చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సైనాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. అదింతవరకు ఆమెకు అందలేదు. ఇటీవల ఆ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దాంతో, ఆమెకు రావల్సిన నజరానాను కూడా ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది.

More Telugu News