'మిలియన్ డాలర్ బేబీ'ని ప్రియాంక చోప్రా 'మేరీ కోం' మించిపోతుందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అందాల ఆరబోతలో ప్రియాంక చోప్రాను మించిన వారు లేరనే అపవాదుకు 'ఫ్యాషన్' సినిమాతో చెక్ పెట్టిన ఈ చిన్నది, తాజాగా 'మేరీ కోం' సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించనుందని బాలీవుడ్ సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. 'మేరీ కోం' సినిమా ట్రైలర్ చూసిన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు కథానాయకులు ప్రియాంకపై అభినందనల వర్షం కురిపించారు. ట్రైలర్ లో ప్రియాంక నటన చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయని టాలీవుడ్ వర్థమాన హీరో సందీప్ కిషన్ పేర్కొన్నారు.
ప్రియాంక చోప్రా సీతాకోక చిలకంత స్వేచ్ఛగా, తేనెటీగంత వేగంగా చేతుల్ని, కాళ్లను కదిపిందని బాలీవుడ్ వర్ధమాన హీరో ఆయుష్మాన్ ఖురానా పేర్కొన్నాడు. ప్రీమియర్ చూసిన మేరీ కోం ఏకంగా ఏడ్చేసింది. ప్రముఖ దర్శకుడు, ఈ సినిమా నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ సినిమా అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నాడు. కాగా 'మేరీ కోం' సినిమా హాలీవుడ్ సినిమా 'మిలియన్ డాలర్ బేబీ'ని మించిపోతుందని విమర్శకులు పేర్కొంటున్నారు.