14 ఏళ్ల కుర్రాడు... పడుకున్న వారిపైకి కారు ఎక్కించేశాడు
వచ్చీరాని డ్రైవింగ్ తో కారునడిపిన 14 ఏళ్ల కుర్రాడు ఫుట్ పాత్ పై పడుకున్నవారిపైకి ఎక్కించేశాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్ లోని వాగ్జీభాయ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వారిని దానిలిండా ప్రాంతానికి చెందిన సలీం రషీద్ ఖాన్ పఠాన్ (40), రషీదా మున్సిఫా షేక్ (40) గా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన బాలుడు కారు వదిలేసి పరారయ్యాడు. ప్రమాదానికి కారణమైన హ్యుండాయ్ ఐ-20 కారు నెంబర్ ఆధారంగా, తర్వాత బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు.