నేడు ఏపీ కేబినెట్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో, రాష్ట్రంలో కొత్తగా రూపొందనున్న పారిశ్రామిక విధానంపై చర్చ జరగనుంది. కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పారిశ్రామిక వేత్తలకు అందించనున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపైనే నేటి కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, విశాఖ సెజ్ డీనోటిఫికేషన్ పైనా చర్చ జరగనుంది. గంగవరం పోర్టు వాటర్ ఫ్రంట్ చార్జీలను ప్రభుత్వమే వసూలు చేయాలన్న నిర్ణయంపై కేబినెట్ భేటీ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని పలు ఆలయాల పాలకవర్గాలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం కూడా నేటి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. పాలక మండళ్ల ప్రక్షాళన కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను ప్రయోగించే విషయంపై కూడా సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించే అవకాశాలు లేకపో్లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వ్యవసాయ రుణాల రీషెడ్యూల్, అందుకు అవసరమయ్యే వనరుల సమీకరణపైనా కేబినెట్ చర్చించనుంది.

More Telugu News