ఉబ్బితబ్బిబ్బవుతున్న రహానే
టీమిండియా యువ బ్యాట్స మన్ అజింక్యా రహానే ఆనంద పారవశ్యంలో మునిగితేలుతున్నాడు. క్రికెట్ మక్కా అని పిలుచుకునే లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించడం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టు తొలి రోజున రహానే సెంచరీయే హైలైట్. కష్టాల్లో పడిన టీమిండియాను రహానే వీరోచిత ప్రదర్శన ఒడ్డున పడేసింది. దీనిపై, ఈ యువకెరటం స్పందిస్తూ, లార్డ్స్ లో సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమేనని తెలిపాడు.
వెల్లింగ్టన్ లో అయినా, లార్డ్స్ లో అయినా సెంచరీ సెంచరీయేనని... అయితే, లార్డ్స్ మైదానం ప్రతిష్ఠ రీత్యా ఇది ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. బరిలోదిగిన తర్వాత శరీరానికి దగ్గరగా వచ్చే బంతులనే ఆడాలని నిర్ణయించుకున్నానని, 25-30 పరుగుల తర్వాత స్వేచ్ఛగా ఆడానని వివరించాడు. రహానే ఏడు టెస్టుల కెరీర్లో ఇది రెండో శతకం కాగా, ఆ రెండూ విదేశీగడ్డపై సాధించనవే కావడం విశేషం.