ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు విముఖత చూపుతున్న ఆ రాష్ట్ర బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేడు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ను కలసి ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా జగదీశ్ ముఖిని ఎన్నుకుని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కోరుతున్నట్లు సమాచారం.
గతేడాది ఢిల్లీ అసెంబ్లీకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు లభించాయి. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. దాంతో, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 28కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 67కి చేరింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదు సీట్లు కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.