ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్రా నియామకానికి అడ్డుచెబుతున్న ట్రాయ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇక రాజ్యసభ ఆమోదం ఒక్కటే తరువాయిగా మిగిలింది. నిన్నటిదాకా ఈ సవరణ బిల్లుపై విమర్శలు గుప్పించిన బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ లతో పాటు ఎన్సీపీ కూడా రెండు రోజుల్లోనే స్వరం మార్చింది. దీంతో, ఈ విషయంలో కాంగ్రెస్ ఒక్కటే ఉభయ సభల్లో ఏకాకిగా మిగిలింది. తనకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసే అధికారిని ఎంచుకునే సంపూర్ణ అధికారం ప్రధానికి ఉందని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. మరోవైపు, ఈ విషయంలో ప్రధానికి ఆమాత్రం స్వేచ్ఛ లేకపోతే ఎలాగంటూ బీఎస్పీ, ఎన్సీపీలు కూడా బీజేపీ నిర్ణయానికి మద్దతు తెలపాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ తో పాటు సీపీఎం సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు. మిగిలిన పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఉండటంతో సభ బిల్లుకు ఆమోదం తెలిపింది.