పాపం, తిండి పోటీలకు వెళ్ళి గుటుక్కుమన్నాడు!
అమెరికాలో దక్షిణ డకోటాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా కస్టర్ పట్టణంలో తిండి పోటీలు నిర్వహించారు. వాల్టర్ ఈగిల్ టెయిల్ (47) అనే వ్యక్తి కూడా ఈ పోటీలో పాల్గొన్నాడు. హాట్ డాగ్ లను ఎవరు వేగంగా తింటారన్న అంశంలో పోటీ పడిన వాల్టర్ కాసేపటికే కుప్పకూలిపోయాడు. హాట్ డాగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరందక మృతిచెందాడు.
సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందని కస్టర్ కౌంటీ షెరిఫ్ రిక్ వీలర్ తెలిపారు. అంతా నిమిషాల్లో జరిగిపోయిందని చెప్పారు. వాల్టర్ మరణం పట్ల స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. అతను ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడని గుర్తుచేసుకున్నారు.