పోలవరం డిజైన్ పై ఇంజినీర్లు చెప్పినట్లు వినాలి: సుజనా చౌదరి
పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతూ, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పై ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పోలవరం డిజైన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని సూచించారు. దాని డిజైన్ పై ఇంజినీర్లు చెప్పినట్లు వినాలన్నారు. సమస్యలను సృష్టించేందుకే పోలవరంపై రగడ అన్న సుజనా, విభజన చట్టం అంశంలో పోలవరంపై చాలా స్పష్టత ఉందని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాగా, హైదరాబాదు విషయంలో గవర్నర్ కు పూర్తి అధికారాలు ఇవ్వడం లేదని, అవసరమైతే గవర్నర్ జోక్యం చేసుకునే విధంగా మాత్రమే మార్పులు చేస్తున్నారని వెల్లడించారు.