‘నవ తెలంగాణ యోచన’ చేసిన కేసీఆర్
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అంశంపై వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాదులోని ఎంసీహెచ్ఆర్డీ లో నిర్వహించిన ‘నవ తెలంగాణ యోచన’ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెరువులను పరిరక్షించి, అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విత్తన కంపెనీలు తెలంగాణలో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.
వ్యవసాయాన్ని అధ్యయనం చేసేందుకు ఇజ్రాయెల్ కు బృందాన్ని పంపిస్తామని ఆయన తెలిపారు. గ్రామాల్లో శ్రమదానం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే రెండేళ్లలో 2.30 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటిదని కేసీఆర్ అన్నారు. హైదరాబాదును మూడంతలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదుకు మరో రెండు ఎయిర్ పోర్టులు రావాల్సిన అవసరముందని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాదులో మొత్తం 58 వేల అక్రమ నిర్మాణాలున్నాయని ఆయన తెలిపారు. గృహ నిర్మాణాల్లో అక్రమాలను సహించేది లేదని, అక్రమార్కులను గుర్తించి జైలుకు పంపిస్తామని అన్నారు.