Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బైక్ పై 13 దేశాలు చుట్టేసిన అమెరికా అమ్మాయి

బ్రిటన్ దేశానికి చెందిన 38 ఏళ్ల స్టెఫ్ జెవోన్స్ ప్రపంచ యాత్ర చేస్తోంది. అది కూడా హోండా బైక్ మీద ఒంటరిగా! గత మార్చి నెలలో లండన్ నుంచి యాత్రను ప్రారంభించిన ఆమె 42 దేశాలు, ఏడు ఖండాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆమె 13 దేశాలను చుట్టేసి ప్రస్తుతం భారత్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. భారత్ లో స్టెఫ్ గుజరాత్, రాజస్థాన్ మీదుగా ముంబై చేరుకుంది. మన దేశంలో 1000 మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సాహస మహిళ తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. "భారతదేశానికి బహుశా నేను సరైన సమయంలో రాలేదేమో. ఇక్కడి వేడి వాతావరణానికి తోడు వేసవికాలం కూడా తోడవడంతో మొదట్లో కొంత అసహనానికి గురయ్యాను. ఇక్కడి ట్రాఫిక్ గురించి నేను ఇంతకు ముందే విన్నాను. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం చాలా సహాయకారులు" అని చెప్పింది. మొత్తం 18 నెలల్లో తన యాత్రను పూర్తి చేయాలని స్టెఫ్ భావిస్తోంది. అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. భారత్ నుంచి ఆమె నేపాల్, ఇండోనేషియా, థాయ్ లాండ్, మలేషియా, కాంబోడియా, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నట్లు ఆమె చెప్పింది. ఆమె ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకోవాలని కోరుకుందాం!

More Telugu News