Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హౌరా మెయిల్లో దొంగల బీభత్సం

ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హౌరా మెయిల్లో దొంగలు స్వైరవిహారం చేశారు. చెన్నై నుంచి హౌరా వెళుతున్న ఈ రైలును ఉలవపాడు-తెట్టు రైల్వే స్టేషన్ల మధ్య దుండగులు చైన్ లాగి నిలిపివేశారు. అనంతరం ఎస్-7, ఎస్-8 భోగీల్లోని ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. అయితే, దోపిడీ విషయమై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతూనే, దొంగలు చైన్ లాగి రైలు నిలిపివేసిన సంగతి నిజమేనంటున్నారు. అటు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఏపీ-నిజాముద్దీన్ లింక్ ఎక్స్ ప్రెస్ లోనూ దొంగల బీభత్సానికి ప్రయాణికులు భీతావహులయ్యారు. దొంగలు ఆయుధాలతో బెదిరించి వారి నుంచి పెద్ద ఎత్తున బంగారు గాజులు, గొలుసులు, నగదు దోచుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు విజయవాడ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఇటీవలి కాలంలో రైళ్ళలో దొంగతనాల పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకప్పుడు రైలు ప్రయాణమంటే సురక్షితమన్న భరోసా ఉండేది. తాజా చోరీల నేపథ్యంలో ఆ నమ్మకం బీటలువారుతోంది. ఈ క్రమంలో ప్రజల్లో పూర్వ విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

More Telugu News