బాబోయ్... చదువుకున్నోళ్లు...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబోయ్... చదువుకున్నోళ్లు...!

విద్యాధికులు అంటే 'గొప్పవారు, వారికి గౌరవమివ్వాలి' అనే భావన క్రమంగా తుడిచిపెట్టుకుపోతోంది. విద్యాధికులు సైబర్ నేరాల్లో ఆరి తేరడంతో విద్యావంతుల క్యారెక్టర్ పై క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా వెలుగు చూసిన రెండు ఘటనలు విద్యాధికుల లేకితనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి మఖ్దుంనగర్ కు చెందిన బురానొద్దీన్ బీఎస్ఎన్ఎల్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సంగారెడ్డిలో ఎస్ బీఐ ఏటీఎంకు వెళ్లిన బురానొద్దీన్ తన డెబిట్ కార్డు పనిచేయకపోవడంతో ప్రక్కనే ఉన్న ఓ నీటుగాడిని సహాయం అడిగాడు. బురానొద్దీన్ చెప్పిన వివరాలు ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేశాడు సదరు నీటుగాడు.

ఆ తరువాత మరోసారి అవసరం పడి డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు బురానొద్దీన్. ఎనిమిది లక్షలు ఉండాల్సిన అకౌంట్ లో కేవలం 1.18 లక్షలు మాత్రమే మిగిలాయి. దీంతో బురానొద్దీన్ శేరిలింగంపల్లి పోలీసులను ఆశ్రయించాడు. వారు కూపీలాగి ఓ వ్యక్తిని పట్టుకున్నారు. తీరా చూస్తే, సంగారెడ్డిలో డెబిట్ కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేయమన్న నీటుగాడిగా అతడిని గుర్తించాడు బురానొద్దీన్. అతనిపేరు కృపారావు (21) అని, అతను పటాన్ చెరువులోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో ఒకే ఫ్లాట్ లో నివసించే బేతపూడి ఏంజెలినా అనే ఎంటెక్ విద్యార్థినికి సీడ్ ప్రొడక్షన్ కంపెనీలో పని చేస్తున్న నాగరాణి మహాజన్ తన డెబిట్ కార్డు వివరాలు చెప్పింది. వాటిని గుర్తు పెట్టుకున్న ఏంజెలినా 1.15 లక్షలు ఆన్ లైన్ షాపింగ్ చేసింది. దీంతో నాగరాణి మహాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె మోసం వెలుగు చూసింది.

More Telugu News