Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్లిష్ట పరిస్థితుల్లో అధికారం చేపట్టాం: చంద్రబాబు

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా బలపడేలా చేశామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేశానని అన్నారు. గతంలో 'విజన్ 2020' అని చెప్పినప్పుడు చాలా మంది ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. అలాంటి వారంతా 420లుగా మారారని ఎద్దేవా చేశారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో అన్నీ కుంభకోణాలు, అవినీతి భాగోతాలేనని ఆయన మండిపడ్డారు. వాజ్ పేయి హయాంలో దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెడితే... యూపీఏ ప్రభుత్వం దేశం, రాష్ట్రంలో ఆర్థిక స్థితిని దివాళా తీయించిందని ఆయన వెల్లడించారు. తాను అధికారం చేపట్టి కేవలం నెల రోజులే అయిందని చెప్పిన ఆయన, అడగగానే అభివృద్ధి చూపించేందుకు తన వద్ద మంత్రదండం లేదని అన్నారు.

గతంలో అధికారం చేపట్టినప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తాయని చెప్పామని... అన్నట్టుగానే సాఫ్ట్ వేర్, ఫార్మా, హార్డ్ వేర్ రంగాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా కష్టకాలంలో అధికారం చేపట్టామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News