Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంపీ ఇంట్లో ఏం జరిగిందంటే...!

ఢిల్లీ పోలీసులకు ఓ చోరీ ఫిర్యాదు అందింది..! అదేమీ సాధారణ పౌరుడి నుంచి అందిన ఫిర్యాదు కాదు. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మహేంద్ర ప్రసాద్ చేసిన కంప్లెయింట్ కావడంతో పోలీసు యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. ఢిల్లీలోని ఎంపీగారి నివాసానికి చేరుకున్న పోలీసు అధికారులు హుటాహుటిన వేలిముద్రల విభాగానికి కబురు పెట్టారు. వారు వచ్చి ఎంపీగారి గార్డెన్ లో కొన్ని వేలిముద్రలు సేకరించారు. పది మంది పోలీసు అధికారులు క్లూస్ కోసం గార్డెన్ ను జల్లెడపట్టారు. పనికొస్తాయేమోనని పాదముద్రలనూ వదల్లేదు. విశ్లేషణ కోసం వెంటనే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

ఇంటి పనివారిని, సెక్యూరిటీ సిబ్బందిని విచారించడంతోపాటు సీసీటీవీ ఫుటేజినీ పరిశీలించాలని నిర్ణయించారు. ఈ హంగామా అంతా చూస్తుంటే భారీ దోపిడీ జరిగిందేమోనన్న అనుమానం రాకపోదు. ఇంతకీ అక్కడ చోరీకి గురైంది కేవలం రెండు పనస పండ్లు మాత్రమేనండోయ్!

More Telugu News