Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాగా భోంచేయాలంటే ఆకలి, రుచే కాదు... ఇవి కూడా చాలా ముఖ్యం!

మా పిల్లాడు చాలా బాగా అడతాడు, కానీ అస్సలు భోంచేయడు... అంటూ చాలా మంది తల్లులు పిల్లలపై ఫిర్యాదు చేస్తుంటారు. చాలా మంది యువతకు బాగా భోజనం చేయాలని ఉంటుంది, కానీ కంచం ముందుకు వెళ్లేసరికి పెద్దగా తినాలనిపించదు. దీనికి కారణం ఆకలి, రుచి మాత్రమే కాదండోయ్, మీరు తినే గిన్నెలు, కంచాలు కూడా! అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఫుడ్ బ్రాండింగ్ ల్యాబ్ అధ్యయనం ప్రకారం కంచం ఎంత పెద్దదైతే మీరు అంత ఎక్కువ భోజనం చేస్తారట.

ప్లేటు 12 అంగుళాల వ్యాసం కలిగి ఉన్నదైతే ఎక్కువగానే తింటారని, 10 అంగుళాలదైతే 22 శాతం తక్కువగా తింటారని పరిశోధకులు తెలిపారు. బరువు పెరగాలంటే పెద్ద కంచంలో తినండి. బరువు తగ్గాలనుకుంటే చిన్న కంచంలో తినండి అని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా తినేప్పుడు వాడే ప్లేటు రంగు కూడా తినే తిండి పరిమాణంపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తెల్లని ప్లేట్ లో ఎర్రటి పాస్తా, ఎర్రటి సాస్ వేసుకుంటే మీకు తెలియకుండానే ఎక్కువ లాగించేస్తారని, అదే పాస్తా, సాస్ ను ఎర్రటి ప్లేట్ లో వేసుకుంటే తక్కువ తింటారని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే చాక్లెట్లు, క్యాండీలు, బార్ లు వంటివి గాజు సీసాలో ఉంచితే ఎక్కువ తింటారని, లోపల ఏముందో తెలియని జాడీలో తినుబండారాలుంటే తినడం తగ్గుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

గాజు సీసాలోంచి తినుబండారాలు కనిపిస్తే 46 శాతం ఎక్కువగా తింటారని అధ్యయనంలో తేలిందట. అందువల్లే భోజన సమయంలో వాతావరణం, ఆహారపదార్థాల ప్రెజెంటేషన్, డెకరేషన్, ప్లేట్లు వంటివి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News