Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుబేరుడికి పెళ్లి కూతురు కావాలట... ప్రకటనకే కోటిన్నర ఖర్చు పెట్టాడు!

జీవిత భాగస్వామి కోసం మాట్రిమోనియల్ సైట్లలో వెతుకులాట ఈ కాలం యువతకు అలవాటే. మరికొందరు పేపర్లలో ప్రకటనలు కూడా ఇస్తుంటారు. కానీ, తను కోరుకున్నట్లుండే అందాలరాసి కోసం 69 ఏళ్ల వృద్ధుడు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నాడు. నచ్చిన చిన్నదాన్ని జల్లెడ పట్టేందుకు లాస్ ఏంజెలెస్ నుంచి స్వస్థలం ముంబైలో వాలిపోయాడు.

దిన్షా విమదలాల్ భారతీయుడే, కానీ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో సెటిలయ్యాడు. ఇతడికి సొంతంగా ఒక విమానం, మెక్సికోలో సుందర భవనం, కార్లు, మోటారు బైకులు ఎన్నో ఉన్నాయి. అయితే, మూడేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదంలో భార్యను కోల్పోయాడు. జీవితపు చరమాంకంలో ఒంటరి కావడంతో మళ్లీ.. కొత్త జీవిత భాగస్వామి కోసం అన్వేషణ మొదలెట్టాడు. ముంబై వచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇలా ప్రకటన ఇచ్చాడు..

'హి ఈజ్ గ్రేట్ గై.. విష్ టు మేరీ హిమ్' వయసు 40 లోపు ఉండాలి. చాలా స్లిమ్ గా ఉండాలి. బాగా అందం అక్కర్లేదు. ఇంగ్లిష్ లో బాగా మాట్లాడాలి. స్కూల్ వరకైనా చదువుకుని ఉండాలి. శాకాహారి మాత్రం కాకూడదు. పెళ్లయి విడాకులు తీసుకున్నా అభ్యంతరం లేదు. కానీ, పిల్లలు మాత్రం ఉండకూడదు. చాలా యాక్టివ్ గా ఉండాలి. పేదవారా, ధనవంతులా అన్న దాంతో సంబంధం లేదు. సాహసాలంటే మక్కువ ఉండాలి...' ఇదీ దిన్షా ప్రకటన సారాంశం. ఈ ప్రకటన కోసం దిన్షా 1.3కోట్లు ఖర్చు పెట్టాడు.

ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. పడచులు క్యూకట్టారు. దిన్షా ఇప్పటికే 20 మందిని ఇంటర్వ్యూ కూడా చేశాడు,కానీ ఒక్కరూ నచ్చలేదు అతడికి. కారణం ఇద్దరు ముగ్గురు బాగున్నారు. కానీ నడుము భాగం చాలా పెద్దగా ఉంది. అది నాకు నచ్చదు అంటున్నాడు. ఏదేమైనా కోరుకున్న, నాజూకైన మెరుపు తీగ కనిపించే వరకూ ముంబై వదిలి వెళ్లకూడదని దిన్షా డిసైడైపోయాడు. చూద్దాం అతడి కోరిక ఎన్ని రోజులలో నెరవేరుతుందో!

More Telugu News